సిద్ధార్థకు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్

హీరో సిద్ధార్థకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చేదు అనుభవం ఎదురైంది.

By Medi Samrat  Published on  29 Sept 2023 3:19 PM IST
సిద్ధార్థకు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్

హీరో సిద్ధార్థకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సిద్ధార్థకు వ్యతిరేకంగా కొందరు నిరసనలు తెలిపి.. అక్కడి నుంచి బలవంతంగా పంపించేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో సిద్ధార్త్ 'చిత్తా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులోని ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. విలేకర్ల సమావేశాన్ని కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. హీరో సిద్ధార్థకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అలాగే వెంటనే ప్రెస్‌మీట్‌ను నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. నిరసనకారుల ఆందోళనలు ఎంతసేపటికీ ఆపకపోవడంతో.. కాసేపు మౌనంగానే ఉన్న హీరో సిద్ధార్థ్‌ చివరకు చేసేది ఏం లేక వేదిక పైనుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్.. సిద్ధార్థకు క్షమాపణలు చెప్పారు. కర్ణాటక ప్రజల తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు ప్రకాష్ రాజ్. "కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉంది.. ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదు. సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని ఎంపీలను ప్రశ్నించకుండా.. నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పు.. అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెబుతున్నాను" అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Next Story