1500 మందితో పాట పూర్తి చేసిన మణిరత్నం.. రోజుకు 30 లక్షల ఖర్చు..!

Ponniyin Selvan Song Shoot Completed. ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు కరోనా మహమ్మారి భయం పట్టుకుంటూ ఉంది.

By Medi Samrat  Published on  12 Sep 2021 9:42 AM GMT
1500 మందితో పాట పూర్తి చేసిన మణిరత్నం.. రోజుకు 30 లక్షల ఖర్చు..!

ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు కరోనా మహమ్మారి భయం పట్టుకుంటూ ఉంది. ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా మిగిలినవారందరిలోనూ భయాలే..! షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ అయితే నిర్మాతలు పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద సినిమాలకు అయితే ఎక్కువ మందిలో మనుషుల అవసరం ఉంటుంది. హిస్టారికల్ బ్యాగ్ డ్రాప్ లో తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఓ పాటలో 1500 మంది పాల్గొన్నారట..! అయితే చిత్ర యూనిట్ తీసుకున్న చర్యల కారణంగా ఒక్కరిలో కూడా కరోనా లక్షణాలు కనిపించలేదట..! ఈ పాట షూటింగ్ కు రోజుకు 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందట..!

మధ్యప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌ లో భాగంగా నటి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఓ పాట షూటింగ్‌ లో పాల్గొంది. డ్యాన్సర్స్‌, టెక్నిషియన్స్‌ అంతా కలిపి దాదాపు 1500 మంది ఉన్నా ఒక్కరిలో కూడా కరోనా లక్షణాల కనిపించలేదు. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట షూటింగ్‌ శనివారం మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో జరిగింది. గ్వాలియర్‌, ఓర్చాల నుంచి వచ్చిన డ్యాన్సర్లతోపాటు మొత్తం 1500 మంది షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు మణిరత్నం షూటింగ్‌ సమయంలో ఎవరిలో కూడా కరోనా లక్షణాలు బయటపడకూదని కఠిన చర్యలు తీసుకున్నారు. అందరికీ ముందస్తుగా రెండు డోసుల టీకాలు వేయించారు. ఎవరు కూడా జలుబు, దగ్గుకు గురికాకుండా చూసుకున్నారు.

ప్రతీరోజు అందరికీ కొవిడ్‌ నిర్ధారిత పరీక్షలు చేయించిన తర్వాతనే షూటింగ్‌లో పాల్గొనేవారు. ఇందుకోసం నిత్యం దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా వంటలు చేసేందుకు 150 మందితో కూడిన వంట గదిని కూడా ఏర్పాటుచేశారు. తొలుత ఓర్చాలో ఆ తర్వాత గ్వాలియర్‌లో షూటింగ్‌ జరిపారు. ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఇక్కడ రెండు రోజుల పాటు ఉండి షూటింగ్‌ పూర్తి చేసుకున్నారని, షూటింగ్‌ 90 శాతం పూర్తయినట్లు సినిమా యూనిట్‌ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో గత నెల 20 నుంచి నిర్విరామంగా షూటింగ్‌ చేస్తున్నారు. 10 వ శతాబ్దం నాటి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Next Story