ఇటు తెలంగాణలో.. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు
Police Complaint Against Ram Gopal Varma. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
By Medi Samrat Published on 25 Jan 2023 3:30 PM GMT
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను స్వామి వివేకానందుడితో పోలుస్తూ మంగళవారం వర్మ వరుస ట్వీట్లు చేశారు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకునే భారతీయులకు, యువకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వర్మ పోస్టులున్నాయంటూ ఏబీవీపీ విద్యార్థులు వర్మపై కేసు పెట్టారు. నిత్యం ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేయడం వర్మకు అలవాటుగా మారిందని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మ పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ట్విట్టర్‌లో కాపులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కొన్ని రోజుల ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అప్పుడు కాపులను కమ్మవాళ్లకు పవన్ కళ్యాణ్ అమ్మేశాడంటూ వర్మ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. రిప్ కాపులు, గ్రేట్ కమ్మ వాళ్లు అంటూ ఆయన చేసిన పోస్ట్‌పై ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు రేపుతుందని, శాంతి భద్రతలకు అది విఘాతం కలిగిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.