టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2024 1:55 PM GMTటాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన శివరామకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. శివరామకృష్ణ నకిలీ పత్రాలతో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేశారు. రాయదుర్గం ప్రాంతంలో 84 ఎకరాల ల్యాండ్‌ను స్వాహా చేసేందుకు యత్నించారు. తొలుత శివరామకృష్ణ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేశారు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్‌లో పాగా వేశారు. 2003లో నకిలీ పత్రాలు సృష్టించి 83 ఎకరాల ల్యాండ్‌కు ఎసరు పెట్టాడు. అయితే అప్పటి ప్రభుత్వం నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. శివరామ కృష్ణ దగ్గర ఉన్న పత్రాలు నకిలీ పత్రాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో పోలీసులు వెంటనే అప్రమత్తమై శివరామ కృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఓయూ పోలీసులు కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.