ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురందేశ్వరి 2004లో బాపట్ల నుంచి 14వ లోక్‌సభకు, 2009లో విశాఖ నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీని వీడారు. 2014లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీకు ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక దగ్గుబాటి పురందేశ్వరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పురందేశ్వరికి శుభాకాంక్షలు అని, కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన పురందేశ్వరి కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు సాగుతారని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.