నటి నిధి అగర్వాల్ కు ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. 'రాజా సాబ్' చిత్రం పాట విడుదల సందర్భంగా ఆమె లులు మాల్‌కు విచ్చేశారు. కార్యక్రమం అనంతరం ఆమె తిరిగి వెళుతుండగా, అభిమానులు ఆమె చుట్టూ గుమిగూడారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిధి అగర్వాల్‌కు అభిమానుల నుంచి కొంత అసభ్యకర ప్రవర్తన ఎదురైంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే లులు మాల్‌తో పాటు శ్రేయాస్ మీడియాపై కేసు నమోదు చేశారు. అభిమానులు వ్యవహరించిన తీరుపై పోలీసులు నిధి అగర్వాల్‌ను సంప్రదించారు. అసౌకర్యానికి గురి చేసిన అభిమానులపై ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఈ అంశంపై తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలుచుకోలేదని నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. లులు మాల్ వ్యవహారంలో తన పట్ల అభిమానులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు సినీ నటి నిధి అగర్వాల్ నిరాకరించారు.
సంఘటన జరిగిన ప్రాంతంలో సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల తాను ఇబ్బందికి గురైన మాట వాస్తవమని ఆమె పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. నిధి అగర్వాల్ పట్ల సుమారు పదహారు మంది అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రం నుంచి రెండవ పాట విడుదల కార్యక్రమం కేపీహెచ్‌బీలోని లులు మాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్‌తో సహా చిత్ర యూనిట్ హాజరైంది.