నందమూరి తారకరత్న కన్నుమూత
Nandamuri Tarakaratna Passed Away. బెంగుళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పోందుతున్న నందమూరి తారకరత్న మృతిచెందారు
By Medi Samrat
బెంగుళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పోందుతున్న నందమూరి తారకరత్న మృతిచెందారు. జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న.. గడిచిన 22 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. తారకరత్న అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఈ రోజు తారకరత్న ఆరోగ్యం మరింత విషమించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది.
తారకరత్న 1983లో జన్మించారు. 2002లో ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఆరంగ్రేటం చేశారు. ఈ చిత్రం తారకరత్నకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోగా యువరత్న, భద్రాది రాముడు వంటి చిత్రాలతో అలరించారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. ఆయన చివరిగా ‘S5 నో ఎగ్జిట్’ కీలక పాత్రలో నటించారు. ఇదిలావుంటే.. నటుడిగా కొనసాగుతూనే అడపాదడపా రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతుండేవారు తారకరత్న. తెలుగుదేశం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.