రష్మికకు చైతూ మద్దతు
నటి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 7 Nov 2023 11:02 AM ISTనటి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రష్మిక మందాన వీడియోపై స్పందించారు. టెక్నాలజీని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో తలుచుకుంటేనే నిజంగా భయంగా ఉందని తెలిపింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న తన డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోందని.. ఇలాంటివి తనకే కాదు.. టెక్నాలజీ దుర్వినియోగం అవుతోన్న క్రమంలో ప్రతి ఒక్కరికీ చాలా భయంగా ఉంటుందని అన్నారు. ఇవాళ తాను ఒక మహిళగా.. నటిగా మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదే తాను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు జరిగి ఉంటే.. ఎలా తట్టుకోగలనో ఊహకు కూడా అందడం లేదన్నారు. తనకు మద్దతుగా ఉన్న తన కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు రష్మిక కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఇలాంటి వాటిబారిన ఇంకా ఎక్కవ మంది పడకముందే సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలంటూ రష్మిక మందాన చెప్పుకొచ్చారు.
ఈ వీడియోపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా అక్కినేని నాగచైతన్య స్పందించారు. రష్మికకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తుండటం చూస్తే నిజంగా బాధేస్తోంది. భవిష్యత్తులో ఇది ఎలా మారబోతోందనే ఆలోచనే భయానకంగా మారింది.
దీని బారిన పడిన, బాధితులైన వ్యక్తులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. కఠినమైన చట్టాన్ని అమలు చేయాలి.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. రష్మిక మందన్న ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ నాగచైతన్య స్పందించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.