AMMA అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్
హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి
By Medi Samrat
హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం (అమ్మ) అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు. అంతకుముందు నటుడు సిద్ధిఖీ, దర్శకుడు రంజీత్‌లు కూడా రాజీనామా చేశారు.
మోహన్‌లాల్‌తో పాటు, ఇతర సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు. దీంతో కమిటీ రద్దు అయ్యింది. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో మోహన్‌లాల్ మౌనాన్ని నటుడు షమ్మి తిలకన్ లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన షమ్మీ.. మోహన్‌లాల్ స్పందించే సామర్థ్యాన్ని కోల్పోయారని అన్నారు.
తీవ్ర విమర్శల తర్వా మోహన్ లాల్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి ముందు దర్శకుడు రంజీత్ కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రంజీత్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని బెంగాలీ నటి ఆరోపించింది.
మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు. సిద్ధిఖీపై ఓ మహిళా నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో సిద్ధిఖీ ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఈ గందరగోళానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీనియర్ పోలీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. మహిళా నటీనటులపై అకృత్యాలపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.