సినీనటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిందని ఆయన న్యాయవాది తెలిపారు. వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మోహన్ బాబు గుండె, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరపున లాయర్ కోర్టుకు తెలియజేసారు. అయినా కూడా ధర్మాసనం ఆయనకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు మోహన్ బాబు.
జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) వ్యతిరేకించారు. మోహన్ బాబుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ జితేందర్ ఇటీవల తెలిపారు. తన చేతిలో గాయపడిన జర్నలిస్టును కలిసి క్షమాపణలు కూడా చెప్పారు మోహన్ బాబు.