ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.!
Mohan Babu Completing 45 Years In Tollywood. ఆయన పేరు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీ ఆయనకు పెట్టిన పేరు
By Medi Samrat Published on 22 Nov 2020 12:46 PM ISTఆయన పేరు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీ ఆయనకు పెట్టిన పేరు మోహన్ బాబు.. అభిమానులు ఇష్టంగా పెట్టిన పేరు కలెక్షన్ కింగ్. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించిన మోహన్ బాబు.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా నేటితో 45 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.
విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఆయన ఏ పాత్ర పోషించినా దేనికదే ప్రత్యేకం. మిగతా హీరోల మాదిరిగా కాకుండా మోహన్ బాబుది ఓ ప్రత్యేక శైలి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈలలు, గోలలతో థియేటర్‌ని దద్దరిల్లేలా చేస్తుంటాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఎన్నో సినిమాలను నిర్మించాడు.
ముక్కుసూటిగా వ్యవహరించే మోహన్‌బాబు ఎంతో క్రమశిక్షణతో 45ఏళ్ల నట ప్రస్థానాన్ని సాగించారు. ఆయన తనయులు విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు కూడా నటనను కెరీర్‌గా ఎంచుకుని రాణిస్తున్నారు. మోహన్ బాబు దర్శక దిగ్గజం దాసరి నారాయణరావును గురువుగా భావిస్తారు. రజినీకాంత్ ఆయనకు అత్యంత సన్నిహితుడు.
Congratulations to my Hero @themohanbabu
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2020
on completing 45 years as an actor today! Proud! #MB45 pic.twitter.com/gcCPHG7otA
1952 మార్చి 19న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో జన్మించాడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు, ఒక సోదరి. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు,, తిరుపతిలో జరిగింది. మోహన్‌బాబు చెన్నైలో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు ఆయన కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు ఇప్పటివరకూ 600 చిత్రాలకు పైగా నటించాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్‌బాబు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. విద్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు స్థాపించాడు. దాదాపు 200 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించిన ఆయన కళాప్రతిభను మెచ్చి కేంద్రప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇదిలావుంటే.. మోహన్‌బాబు ఇటీవల విడుదలైన ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో భక్తవత్సలం నాయుడు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈయన ప్రస్తుతం దేశభక్తి ప్రధానంగా 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా శనివారం ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కోపోద్రిక్తుడై తీక్షణ చూపులతో కనిపిస్తున్నారు మోహన్‌బాబు. ఇప్పటివరకు తెలుగు తెరపై రానటువంటి కథాంశంతో వినూత్నమైన జోనర్‌లో సినిమా రానుంది. ప్రస్తుత తెలుగు సినిమా రంగంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న మోహన్ బాబు.. భవిష్యత్‌లోనూ మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని కోరుకుందాం.