కులం కూడు పెట్టదు : మోహన్ బాబు

నటుడు మోహన్‌బాబు నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 4:46 PM IST
కులం కూడు పెట్టదు : మోహన్ బాబు

నటుడు మోహన్‌బాబు నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. శోభన్‌బాబు హీరోగా వచ్చిన ‘కన్నవారి కలలు’(1974) నటుడిగా ఆయన తొలి సినిమా. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారాయన. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘స్వర్గం-నరకం’(1975)తో హీరోగా మారారు. కమెడియన్ గా, విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్ అయ్యారు.

ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. జీవితంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. భోజనం కూడా దొరకక ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయన్నారు. 'మా' అసోసియేషన్ లో ఉన్న మీ అందరితో కలిసి భోజనం చేయాలనుకున్నానని.. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తన కుమారుడు విష్ణుని అడిగానని చెప్పారు. తాను ఎన్నో మంచి పనులు చేశానని, అయితే వేదికలపై వాటి గురించి చెప్పడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఎంతో మంది పిల్లలను తాను చదివించానని, చనిపోయిన ఒక నటుడి భార్యకు ఉద్యోగం ఇప్పించానని, వాళ్ల పిల్లలను చదివించానని, ఆ పిల్లలు కూడా హీరోలు అయ్యారని తెలిసి ఎంతో సంతోషించానన్నారు. కులం కూడు పెట్టదని, తమ కులం వాళ్లను తన సినిమా చూడమంటే ఒక్కడు కూడా చూడడని మోహన్ బాబు అన్నారు. తనకు కులమతాలతో సంబంధం లేదని, అందరూ తనకు సమానమేనన్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, నటుడిగా తనకు జన్మనిచ్చిన దాసరి నారాయణరావు దీవెనలు తనపై ఎప్పుడూ ఉంటాయని మోహన్ బాబు భావోద్వేగానికి గురయ్యారు.

Next Story