తెలుగు సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఎంఎం కీరవాణి తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భానుమతిని కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మాతృమూర్తి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న ఎంఎం కీరవాణి కుటుంబసభ్యులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
దర్శకుడు రాజమౌళికి కీరవాణి తల్లి పిన్ని అవుతారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు కీరవాణి సంగీతాన్ని అందించారు. స్టూడెంట్ నంబర్ 1 నుండి ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకూ కీరవాణినే సంగీత స్వరాలను సమకూర్చారు. కీరవాణి తనయుడు కాలభైరవ. కాలభైరవ కూడా సంగీత దర్శకుడే. కాలభైరవ ఆర్ఆర్ఆర్ లో కొమురం భీముడో, అరవింద సమేతలో పెనివిటి పాటలను ఆలపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.