ఓ స్మగ్లర్‌ను హీరో చేశారు.. నేరాలను చట్టబద్ధంగా కట్టడి చేసే పోలీసు అధికారి ఎలా జీరో అవుతాడు.? : మంత్రి సీతక్క

పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని.. అలాంటి సినిమాలకు కేంద్ర ప్రోత్సాహకాలు లేవు అని విచారం వ్య‌క్తం చేశారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 2:41 PM GMT
ఓ స్మగ్లర్‌ను హీరో చేశారు.. నేరాలను చట్టబద్ధంగా కట్టడి చేసే పోలీసు అధికారి ఎలా జీరో అవుతాడు.? : మంత్రి సీతక్క

పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీం లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని.. అలాంటి సినిమాలకు కేంద్ర ప్రోత్సాహకాలు లేవు అని విచారం వ్య‌క్తం చేశారు. ఒక స్మగ్లర్, పోలీసును బట్టలూడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు.. ఇది దేనికి సంకేతం.. ఒక స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారని మంత్రి సీతక్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ నెల 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో లీలా గార్డెన్‌లో జ‌రిగిన‌ క్రిస్మస్ పండగ ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క ఈ వ్యాఖ్య‌లు చేశారు. జై భీమ్ సినిమా మన హక్కులను మనకు చూపించింది.. మనకు ప్రేరణగా నిలిచింది.. అలాంటి సినిమాను ప్రోత్సహించ లేదు అలాంటి సినిమాకు అవార్డులు రాలేదు.. కానీ చట్టబద్ధంగా డ్యూటీలో ఉండే పోలీసు అధికారులను పోలీస్ స్టేషన్ లోనే ఒక స్మగ్లర్ బట్టలిప్పేసిన‌ చిత్రానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయన్నారు.

సినిమాలకు మేము వ్యతిరేకం కాదు.. సందేశాత్మక చిత్రాలకు అవార్డులు ఇవ్వాలి.. స్మగ్లింగ్ ఇతివృత్తంగా వచ్చే సినిమాలకు అవార్డులు ఇస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. నేరాలను చట్టబద్ధంగా కట్టడి చేసే పోలీసు అధికారి ఎలా జీరో అవుతాడని ప్ర‌శ్నించారు. సమాజాన్ని ఒక ఉన్నతమైన సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణాలతో సినిమాలు ఉండాలన్నారు. ఇతరుల గౌరవాన్ని కాపాడే సినిమాలు తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుందన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థలను అంతా గౌరవించాలి.. భవిష్యత్ తరాలకు మనం ఏమి నేర్పిస్తున్నామన్నదే ముఖ్యం అన్నారు.

Next Story