చిరంజీవిపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ప్రశంసల వర్షం

Minister Mallareddy Praises Chiranjeevi. మేడే సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్మికోత్సవానికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.

By Medi Samrat  Published on  1 May 2022 12:23 PM GMT
చిరంజీవిపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ప్రశంసల వర్షం

మేడే సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్మికోత్సవానికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... "అన్నా... నేను నీ అభిమానిని అన్నా. నేను నీ అంత ఫేమస్ కాదన్నా! నువ్వు కేంద్రమంత్రివి కూడా అయ్యావు అన్నా. మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారన్నా." అంటూ ఓ అభిమాని లాగ మాట్లాడేశారు. "నువ్వు అన్నీ సాధించావన్నా! కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చావు... వాళ్లను ఆదుకున్నావు. కష్టకాలంలో కార్మికుల కోసం నిలబడింది నువ్వొక్కడివే అన్నా. నాదొక రిక్వెస్ట్ అన్నా... ఇకపై కార్మికుల కోసం సినిమాలు, ఓటీటీ కంటెంట్ తీయాలన్నా. ఓటీటీ కంటెంట్ లో కార్మికులను కూడా భాగస్వాములను చేసి, వాళ్లకు కూడా షేర్ ఇస్తే వాళ్లు గొప్పవాళ్లయిపోతారన్నా!" అంటూ చెప్పుకొచ్చారు.

తెలుగు ఫిల్మ్ ఫెడేరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికులు ఎన్నో బాధలను దిగమింగి పనిచేస్తారని వెల్లడించారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వేళ కార్మికులకు నిత్యావసరాలు ఇవ్వడం బాధ్యతగా భావించానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు కలిసి ఉండాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా సంక్షోభం వల్ల సినీ, పర్యాటక రంగాలు ఎంతో నష్టపోయాయని వెల్లడించారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక సినీ, పర్యాటక రంగాలు కాస్త నిలదొక్కుకున్నాయని, తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కిషన్ రెడ్డి ప్రశంసించారు.

Next Story