పిలుపు వచ్చింది.. సీఎం జగన్ ను కలవనున్న చిరంజీవి అండ్ టీమ్
Megastar And Team Meet With CM Jagan. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యమంత్రిని కలిసి వీటిని తెలియజేయాలని అనుకుంటూ ఉన్నామని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. ఈ నెల 20న అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సారథ్యంలోని బృందం రెడీ అవుతోంది. సీఎం జగన్‌ను కలవనున్న వారిలో అక్కినేని నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌బాబు తదితరులు ఉన్నారు. జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న అంశాలపై చిత్రపరిశ్రమ ప్రముఖులు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. వీటిలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే అవకాశం కోరడం, నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించడంతోపాటు గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టికెట్టుకు పది రూపాయలు, కుర్చీకి రూ.20 వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని కోరడం వంటివి ఉన్నాయి. సినిమా టికెట్లను ఇకపై ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయించడంపైనా చిరంజీవి బృందం ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.. దీంతో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు పెద్దగా లాభాలు రావడం లేదని అంటున్నారు.