ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీ రావు
చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడైన ఆయన..
By Medi Samrat Published on 8 Jun 2024 11:00 AM ISTచెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడైన ఆయన.. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు అధినేతగా ఉన్నారు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఆయన నిర్మాతగా కూడా మంచి పేరునే సంపాదించుకున్నారు.
ఉషాకిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి ఆయన మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సంస్థ చివరిగా 'దాగుడు మూతలు దండాకోరు' అనే సినిమా చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమా నిర్మాణంలో గ్యాప్ ఇచ్చింది. 2019 సమయంలో ఉషాకిరణ్ మూవీస్ యాక్టీవ్ అయ్యేందుకు యత్నించింది. ఉషాకిరణ్ సంస్థ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మరో 15 తీస్తే వంద సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుందని భావించి ఆ మైలు రాయి కోసమైనా సినిమాలు చేయాలని రామోజీరావు అనుకున్నారు. 2016-17 తరువాత తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన కొంతమంది దర్శకులకు ఉషాకిరణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంతమందికి అడ్వాన్సులూ ఇచ్చారు. కరోనా కారణంగా అనుకున్న సినిమాలు కూడా ఆగిపోయాయి. దీంతో ఉషాకిరణ్ మూవీస్ సినిమాల నిర్మాణం ముందుకు సాగలేదు. 100 సినిమాలు చేయాలనుకున్న రామోజీరావు నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు.