గోవాలో రోడ్డు ప్రమాదం.. హీరోయిన్ దుర్మరణం

Marathi Actor Ishwari Deshpande Dies After Her Car Plunges Into Creek In Goa. గోవాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరాఠీ హీరోయిన్ ప్రాణాలు కోల్పోయింది.

By M.S.R
Published on : 22 Sept 2021 5:37 PM IST

గోవాలో రోడ్డు ప్రమాదం.. హీరోయిన్ దుర్మరణం

గోవాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరాఠీ హీరోయిన్ ప్రాణాలు కోల్పోయింది. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న 25 ఏళ్ల ఈశ్వరి దేశ్ పాండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈశ్వరి దేశ్ పాండే తన ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలిడే ట్రిప్ కు వెళ్లింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 20 సోమవారం తెల్లవారుజామున ఇద్దరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామ సమీపంలోని బాగా కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఆ సమయంలో కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో బయటకు రాలేక కారులోనే ఇరుక్కుపోయారు. ఈ దుర్ఘటనలో ఈశ్వరితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ శుభమ్ డెడ్జ్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది ఈశ్వరి. ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. శుభమ్, ఈశ్వరి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అక్టోబర్ లో నిశ్చితార్థం కూడా నిర్ణయించారు కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.


Next Story