ఒక లేడీ జర్నలిస్ట్ ను దుర్భాషలాడాడనే అభియోగాలపై మలయాళ నటుడు శ్రీనాథ్ భాసిని మరాడు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడిపై పడ్డ అభియోగాలు బెయిలబుల్ అని తేలింది. దీంతో ష్యూరిటీలు సమర్పించిన తర్వాత అతను మారాడు పోలీస్ స్టేషన్ నుండి విడుదలవ్వనున్నాడు.
భాసి తన తాజా చిత్రం 'చట్టంబి' ప్రమోషన్‌లో భాగంగా చేసిన ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టును బూతులు తిట్టాడు. అయితే.. తనను అవమానించినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించే విధంగా తాను కూడా చేశానని.. తాను ఏ తప్పు చేయలేదని అన్నాడు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. అయితే సదరు మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ ముందు హాజరవ్వాలని కోరారు. సోమవారం ఉదయం పోలీసుల ముందు అతడు హాజరు కాలేనని.. తర్వాత రోజు వస్తానని చెప్పాడు. అందుకు పోలీసులు కూడా అంగీకరించారు. ఆ తర్వాత మనసు మార్చుకుని సోమవారమే వస్తానని పోలీసులకు సమాచారం అందించాడు. గంటపాటు విచారించిన పోలీసులు శ్రీనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు.
భాసి రేడియో జాకీగా తన ప్రయాణం ప్రారంభించాడు. ఆపై వీడియో జాకీగా మారిపోయాడు. 2011లో మోహన్‌లాల్, అనుపమ్ ఖేర్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ప్రణయం' తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకు దాదాపు 50 సినిమాల్లో నటించాడు.