ఇటీవల జరిగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు.. రాజకీయ ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లు పోటీ చేశాయి. కాగా చివరకు మంచు విష్ణు ప్యానెల్ గెలవగా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది. ఆ తర్వాత 'మా' అధ్యక్షుడుగా మంచు విష్ణు బాధత్యలు చేపట్టారు. తాజాగా 'మా' ఎన్నికలకు సంబంధించి మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున గెలుపొందిన సభ్యుల రాజీనామాలను ఆమోదించారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది సభ్యులు గెలిచారు. ఆ తర్వాత వారు తమ పదవికి రాజీనామా చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలు చేయొద్దని ప్రకాష్ ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులను కోరామని, వెనక్కి తీసుకోమని చెప్పినా వాళ్లు అంగీకరించలేదన్నారు. అందుకే చివరికి వారి రాజీనామాలను ఆమోదించామని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. 'మా' సభ్యత్వానికి ప్రకాష్ రాజ్, నాగబాబు లు రాజీనామా చేయగా.. వారి రాజీనామాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. 'మా' భవనంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని అన్నారు.