లీగల్ థ్రిల్లర్‌గా వస్తున్న 'లీగల్లీ వీర్'
తెలుగులో ఆసక్తికర కథాంశంతో 'లీగల్లీ వీర్' అనే సినిమా రాబోతోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది.
By Medi Samrat Published on 26 Dec 2024 8:31 PM IST
తెలుగులో ఆసక్తికర కథాంశంతో 'లీగల్లీ వీర్' అనే సినిమా రాబోతోంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి గోగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిజజీవితంలోనూ లాయర్‌గా రాణిస్తున్న మలికిరెడ్డి వీర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా సస్పెన్స్, కోర్ట్‌రూమ్ డ్రామా, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కింది. ఓ హత్య కేసులో నిందితుడిని కాపాడడానికి వీర్ చేసే ప్రయత్నం ఈ సినిమాలో చూడొచ్చు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న వీర్ రెడ్డి నిజ జీవిత అనుభవం నుండి ఈ చిత్రం తెరకెక్కింది. ఓ కేసును గెలవాలంటే సాక్ష్యాలు కావాలి, ఆ సాక్ష్యాలను సంపాదించడానికి ఎంత దూరమైనా వెళ్లే లాయర్ క్యారెక్టర్ ను మలికిరెడ్డి వీర్ రెడ్డి పోషించారు.
ఈ చిత్రం వీర్‌రెడ్డికి నటుడిగా తొలి సినిమా కాగా.. ఈ పాత్రను పోషించడానికి తనకు ప్రేరణ ఏమిటో ఆయన వివరించారు. "టాలీవుడ్‌లో లీగల్ థ్రిల్లర్‌లు చాలా తక్కువగా ఉన్నాయి, ఈ సినిమాను వినోదభరితంగా కాకుండా న్యాయ వ్యవస్థ గురించి అవగాహన కల్పించే అవకాశంగా భావించాను" అని తెలిపారు. నటనా పరంగా శిక్షణ లేనప్పటికీ, అనుభవజ్ఞుడైన న్యాయవాది పాత్రలో వాస్తవికత కనిపిస్తుంది. నటనలో తనను మార్గనిర్దేశం చేసేందుకు దర్శకుడిపైనే ఆధారపడ్డానని వీర్ రెడ్డి తెలిపారు. " యాక్టింగ్ అంటే మొదట భయపడ్డాను, కానీ చిత్ర బృందం నాకు మద్దతు ఇచ్చింది," అని ఆయన తెలిపారు.
లీగల్ వీర్ సినిమా COVID-19 మహమ్మారి సమయంలో మరణించిన తండ్రి వీర్ నారాయణరెడ్డికి నివాళి అని వీర్ రెడ్డి తెలిపారు. “మా నాన్నగారి జ్ఞాపకార్థాన్ని గౌరవించాలనుకుంటున్నాను. ఈ చిత్రం ఆయన వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి మార్గంగా మారింది." అని అన్నారు. వీర్ రెడ్డి సొంత అనుభవం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చట్టపరమైన పరిభాష, ప్రొసీడింగ్‌లు ఖచ్చితంగా చిత్రీకరించామని తెలిపారు. లీగల్లీ వీర్ టాలీవుడ్‌లో సరికొత్త కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌ను వీక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సినిమాలో లీలా శాంసన్, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్ వంటి ప్రముఖ నటులతో సహా బలమైన తారాగణం ఉందని వెల్లడించారు. లీగల్లీ వీర్ సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న విడుదల కానుందని పేర్కొన్నారు.