ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు
Krishnamraj's last rites are over. లెజెండరీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి.
By Medi Samrat Published on 12 Sept 2022 6:18 PM ISTలెజెండరీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్ లోని కనకమామిడి ఫాంహౌస్ లో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ పెదనాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులను, ప్రముఖులను, బంధుమిత్రులను, అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్ లోకి పంపించారు.
కనకమామిడి ఫాంహౌస్ కృష్ణంరాజుకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఫాంహౌస్ లోనే శేషజీవితం గడపాలని భావించి, ఇంటి నిర్మాణానికి కూడా పూనుకున్నారని తెలుస్తోంది. ఆయనకు బాగా నచ్చిన కనకమామిడి ఫాంహౌస్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణంరాజు మధుమేహం తదితర అనారోగ్య సమస్యలతో చాలాకాలం నుంచి బాధపడుతున్నారు. కరోనా సోకగా, తదనంతర సమస్యలతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై కన్నుమూశారు.
జూబ్లీహిల్స్ లో కృష్ణంరాజు పార్థివదేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. వేలాది మంది అభిమానులు అక్కడికి వచ్చారు.