హిందీ భాషపై ఈగ సుదీప్ సంచలన వ్యాఖ్యలు
Kicha Sudeep Sensational Words About Hindi Language. బాలీవుడ్ సినిమాల జమానా అయిపోయిందని చాలా మంది అంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 25 April 2022 4:58 AM GMTబాలీవుడ్ సినిమాల జమానా అయిపోయిందని చాలా మంది అంటూ ఉన్నారు. ఎందుకంటే సరైన సత్తా ఉన్న హిందీ సినిమాలు ప్రజల నుండి ఆదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఇక దక్షిణాది సినిమాల ప్రభంజనం మామూలుగా లేదు. హిందీ ఆడియన్స్ ఒకప్పుడు యూ ట్యూబ్ లో దక్షిణాది సినిమాల డబ్బింగ్ ను చూస్తూ ఉండేవాళ్లు.. ఇక ఇప్పుడు థియేటర్లకు రప్పించేలా భారీగా సినిమాలను నిర్మించడమే కాకుండా.. థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేస్తూ ఉన్నారు. బాహుబలి నుండి మొదలైన ప్రభంజనం కేజీఎఫ్ దాకా కొనసాగింది. రాబోయే రోజుల్లో మరిన్ని దక్షిణాది సినిమాలు హిందీ ఆడియన్స్ కు దగ్గర కాబోతూ ఉన్నాయి.
తాజాగా కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై కీలక కామెంట్స్ చేశాడు కిచ్చ సుదీప్. ఓ ఈవెంట్ లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే హిందీ సినిమాలు దక్షిణాదిన పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది హిందీ మూవీ మేకర్స్ భావిస్తూ ఉన్నారు. అడపా దడపా కొన్ని సినిమాలు దక్షిణాది వారికి నచ్చుతూ ఉన్నాయి కానీ.. బాహుబలి సిరీస్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సిరీస్ రేంజిలో హిట్స్ అయితే ఇక్కడ దక్కడం లేదు. అంతేకాకుండా బాలీవుడ్ సినిమాలకు దక్షిణాది సినిమాలు ఎంతో ఛాలెంజ్ ను విసురుతూ ఉన్నాయి. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది.