భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత భారీగా ఉంది. ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇక ప్రాణాలు కాపాడాల్సిన సిబ్బంది ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. మరో వైపు కరోనా రోగుల పట్ల వివక్షను కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే అతడొక సినిమా హీరో.. కానీ రియల్ లైఫ్ లో కూడా హీరోగా నిలిచాడు. కరోనా రోగుల అంతిమసంస్కారాలు నిర్వహిస్తూ.. అంబులెన్స్ డ్రైవర్ గా మారాడు.
ఆ కన్నడ హీరో పేరు అర్జున్ గౌడ. 'ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్'.. పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఎన్నో మంచి పనులను చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం కరోనాతో చనిపోయిన వారిని తరలించడానికి ముందుకు రావడానికి చాలా మంది రావడం లేదు. దీంతో అతడే డ్రైవర్‌గా మారి కరోనాతో మరణించిన వారి మృతిదేహాలను శ్మశానానికి తరలిస్తున్నాడు. అర్జున్ గౌడ తన సంస్థ ద్వారానే కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు.
దేశంలో అంత్యక్రియలు ఎంతో కష్టంగా మారాయి. చాలా స్మశాన వాటికల వద్ద ఏకంగా అంత్యక్రియలకు పెద్ద పెద్ద క్యూలే ఉన్నాయి. అంత్యక్రియలు చేసేందుకు గానీ, మృతదేహాలను తీసుకెళ్లేందుకు గానీ అంబులెన్స్ డ్రైవర్లు కూడా ముందుకు రావట్లేదు. కానీ అర్జున్ గౌడ చేసిన పని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అర్జున్ గౌడను పలువురు ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.