సంచలన విషయాలను వెల్లడించిన జీవిత రాజశేఖర్
Jeevitha Rajashekar About Cheque Bounce Case. 2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ.
By Medi Samrat Published on 23 April 2022 4:24 PM IST2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఈ చిత్ర నిర్మాణంలో జీవితా రాజశేఖర్‌లతో పాటు జ్యోస్టర్ సంస్థ కూడా భాగమైంది. ఈ సినిమా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి కారణం అయింది. జ్యోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమ చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టుని ఆశ్రయించారు. గతంలో జీవితా రాజశేఖర్ తమకు రూ.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎగగొట్టారని, ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయని హేమ తెలిపారు. రాజశేఖర్ త్వరలోనే జైలుకు వెళ్తారని ఆ సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. జీవిత రాజశేఖర్ లు తమను మోసం చేశారని.. ఈ కేసులో నగరి కోర్టు జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని తెలిపారు. జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారని కోటేశ్వరరాజు ఆరోపించారు.
జీవిత రాజశేఖర్ శనివారం నాడు ప్రెస్ మీట్ లో పలు విషయాలను మాట్లాడారు. నగరి కోర్టులో రెండు నెలలుగా ఈ కేసు నడుస్తోందన్నారు. తనకు సమన్లు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అరెస్ట్ వారెంట్ మాత్రం అందలేదన్నారు. అయినప్పటికీ తమ లాయర్లు కోర్టులో అటెండ్ అయ్యారని అన్నారు. కోర్టు తీర్పు వచ్చాక ఎవరు తప్పు చేశారో.. ఎవరిది మోసమో తెలుస్తుందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనీ.. ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెప్తామన్నారు జీవిత రాజశేఖర్. తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యంతో పాటు.. తప్పు చేయకపోతే నిలదీసే ధైర్యం కూడా ఉందన్నారు. రెండు నెలలకుపైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు వారు మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదని, ఇంతకు ముందు కూడా తనపై వారెంట్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ కేసు తానే గెలిచినట్లు జీవిత తెలిపారు.