ఆస్కార్ రేసులో మలయాళ చిత్రం 'జల్లికట్టు' నిలిచిన సంగతి తెలిసిందే. 93వ అకాడమీ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన జల్లికట్టు చిత్రం.. తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్ అవార్డ్ బరిలో భారత్ నుంచి మొత్తం 27 సినిమాలు పోటీపడగా.. వాటిలో 'జల్లికట్టు' రేసులో నిలిచింది.
తాజాగా జరిగిన విదేశీ చిత్రాల కేటగిరి షార్ట్‌లిస్టులో.. ఈ సినిమా జల్లికట్టు ఎంపిక కాలేకపోవడం భారత అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి. 'జల్లికట్టు' సినిమాకి లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించిన జల్లికట్టు చిత్రం.. భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మరోవైపు కరిష్మా దేవ్ దూబె దర్శకత్వం వహించిన బిట్టూ మాత్రం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి షార్ట్‌లిస్ట్ కావడం విశేషం. అకాడమీ బుధవారం 9 కేటగిరీలకు చెందిన షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించింది. ఈ కేటగిరీల్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్, లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలకు షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించారు. ఈ లిస్ట్‌ల నుంచి అకాడమీ ఇప్పుడు ఆస్కార్స్ 2021కు నామినీలను ఎంపిక చేస్తుంది.