విశాల్ 'చక్ర' మూవీ రివ్యూ..!

Hero Vishal Chakra Movie Review. విశాల్ సినిమా చక్ర రిలీజ్ కు ముందే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. 'చక్ర' ఫిబ్రవరి 19న విడుదలైంది.

By Medi Samrat  Published on  19 Feb 2021 3:32 PM IST
Hero Vishal Chakra Movie Review

విశాల్ సినిమా చక్ర రిలీజ్ కు ముందే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. విశాల్ హీరోగా, నిర్మాతగా రూపొందిన సినిమా 'విశాల్ చక్ర' ఫిబ్రవరి 19న ప్రపంచ వ్యాప్తంగా ఎట్టకేలకు ఐదు భాషల్లో విడుదలైంది. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా క‌సాండ్ర న‌టించారు. మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య, సృష్టిడాంగే త‌దిత‌రులు నటించారు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విశాల్, యువ‌న్ శంక‌ర్‌ రాజా కాంబినేష‌న్‌లో వచ్చిన 10వ చిత్రం కావడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

కథ:

సినిమా మొదలవ్వగానే వరుస దొంగతనాలు మొదలవుతాయి. వృద్ధులు ఉండే ఇళ్లనే టార్గెట్ చేసిన ఇద్దరు ముసుగుదొంగలు ఆగష్టు 15న వరుసగా 49 ఇళ్లల్లో దొంగతనం చేసుకుంటూ.. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్తారు. ఇలా ఆగష్టు 15న వరుస దొంగతనాలు జరగడం పోలీసు వ్యవస్థకు చాలా చెడ్డ పేరు తీసుకుని వస్తుంది. దీంతో పోలీసు విభాగం ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ గాయత్రి(శ్రద్ధ శ్రీనాథ్) కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగుతుంది. 49 ఇళ్లల్లో దొంగతనం జరగలేదు 50 ఇళ్లల్లో ఈ దొంగతనం జరిగిందని కనుగొంటారు. ఆ 50వ ఇంట్లో నుండి పరమ వీర చక్ర మెడల్ ను కూడా కొట్టేస్తారు. అప్పటికే గాయత్రికి ఆర్మీలో ఉంటున్న చంద్రు(విశాల్) కు మధ్య ప్రేమ ఉంటుంది. పరమ వీర చక్ర మెడల్ ను కొట్టేసింది చంద్రు ఇంట్లోనే కావడంతో ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని సాల్వ్ చేయడానికి ముందుకు వెళతారు. చంద్రు, గాయత్రిలు ఒక్కో క్లూను పట్టుకుని ఆ ఇద్దరు ముసుగుదొంగల దగ్గరకు చేరుకుంటారా.. ఇద్దరు దొంగలేనా.. ఇంకెవరైనా మాస్టర్ మైండ్ వారి వెనకాల ఉన్నారా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

నటీనటులు:

ఈ సినిమాలో ఎప్పటిలాగే విశాల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఇక శ్రద్ధ శ్రీనాథ్ చాలా వరకూ మెప్పించినప్పటికీ కొన్ని కొన్ని సన్నివేశాల్లో హీరో ఏమి చేస్తుంటాడో చూడడానికే సరిపోతుంది. ఇన్వెస్టిగేషన్ లో శ్రద్ధ శ్రీనాథ్ ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే అనే అభిప్రాయం తలెత్తకమానదు. కేఆర్ విజయ తన పాత్ర పరిధి మేరకు నటించారు. రోబో శంకర్ అప్పుడప్పుడు కామెడీ చేయాలని ప్రయత్నించినా.. సీరియస్ సినిమాలో పెద్దగా సెట్ అవ్వలేదు.

విశ్లేషణ:

అభిమన్యుడు సినిమా ద్వారా మంచి హిట్ ను అందుకున్నాడు విశాల్. సైబర్ క్రైమ్ చుట్టూ అభిమన్యుడు సినిమా తిరిగినా.. అదే తరహా కథతో చక్రను రూపొందించారు. మొదటి సినిమానే అయినా డైరెక్టర్ ఆనందన్ మెప్పించాడు. మరీ గ్రిప్పింగ్ గా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఒక ఇన్వెస్టిగేషన్ ను ఎక్కడి నుండో వచ్చిన ఆర్మీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ను లీడ్ చేయడం అన్నది కాస్త లాజిక్ గా అనిపించకమానదు. దొంగలు, పోలీసుల మధ్య అదేదో పిల్లి-ఎలుక ఆటగా అనిపిస్తుంది తప్పితే కథ మరీ అంత గొప్పగా అనిపించదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అన్నది పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఇక తప్పించుకోడానికి విలన్ చేసే ప్రయత్నాలు కూడా ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తాయి. ఒక్క సాంగ్ కూడా లేకుండా సినిమా సాగుతుంది. యువన్ శంకర్ రాజా సినిమాకు మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందించాడు. ప్రస్తుత జెనరేషన్ సైబర్ దాడుల్లో చాలా వరకూ నష్టపోతున్నారని.. ఇప్పటికే అభిమన్యుడు సినిమాలో చూపించారు.. మళ్లీ చక్ర తీసిన ఉద్దేశ్యం ఏమిటో అర్థం అవ్వదు.. ఏమి చెప్పాలని అనుకోవాలనుకుంటున్నారో కూడా ఆఖరికి అర్థం అవ్వదు. బాలసుబ్రమణియం విజువల్స్ యావరేజ్ గా అనిపిస్తాయి. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉండి ఉంటే బాగున్ను. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బాగుంది. చక్ర కంటే ఇంతకు ముందు వచ్చిన అభిమన్యుడే బాగుంది.

ఓవరాల్ రేటింగ్: 2.5/5




Next Story