సత్తా చాటిన హనుమాన్.. ఆ లిస్టులో 13వ సినిమా
హనుమాన్ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉంది. ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ సాధించి, ఈ మైలురాయిని సాధించిన 13వ టాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
By Medi Samrat Published on 22 Jan 2024 9:00 PM ISTహనుమాన్ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ ఉంది. ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ సాధించి, ఈ మైలురాయిని సాధించిన 13వ టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ ఇండియన్ సూపర్ హీరో చిత్రం రోజురోజుకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కొనసాగిస్తూ ఉంది. ఈ చిత్రం 10 రోజులకు 195 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రోజు 200 కోట్ల క్లబ్‌లో చేరింది. మొత్తంమీద, ఈ క్లబ్‌లో చేరిన 13వ తెలుగు చిత్రంగా నిలిచింది. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన సినిమాలలో 'హను మాన్' సినిమా.. తెలుగుతో పాటు హిందీలో కూడా జనవరి 12వ తేదీన విడుదలైంది. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అనుదీప్ దేవ్ - గౌరహరి సంగీతాన్ని సమకూర్చారు.
హనుమాన్ సినిమా సులువుగా 250కోట్ల గ్రాస్‌ని సాధించగలదు. ఇది పూర్తి రన్‌లో 300కోట్ల మార్క్‌ను సులువుగా చేరుకోగలదు. హిందీలో హనుమాన్ సినిమా లాంగ్ రన్ ఈ వారాంతంలో విడుదల కానున్న హృతిక్ రోషన్ హిందీ చిత్రం ‘ఫైటర్’కి వచ్చే ప్రజాస్పందనపై ఆధారపడి ఉంటుంది.
200 కోట్ల మ్యాజికల్ ఫిగర్ దాటిన సినిమాలలో ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు ఉన్నాయి. బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ చిత్రాలు ఆ మార్కును దాటాయి. మెగాస్టార్ చిరంజీవికి సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కూడా ఆ లిస్టులో ఉన్నాయి. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ కూడా 200 కోట్ల గ్రాస్ దాటిన సినిమా లిస్టులో ఉన్నాయి. రామ్ చరణ్ రంగస్థలం, రామ్ చరణ్-ఎన్టీఆర్ నటించిన RRR సినిమాలు ఉండగా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఆ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు తేజ సజ్జా కూడా హనుమాన్ సినిమాతో ఈ క్లబ్‌లో చేరాడు.