రేపు భీమ్లా నాయక్ రిలీజ్‌.. బెనిఫిట్ షో వేస్తే క‌ఠిన చర్యలు..!

Govt troubles begin for Bheemla Nayak in AP.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 3:07 AM GMT
రేపు భీమ్లా నాయక్ రిలీజ్‌.. బెనిఫిట్ షో వేస్తే క‌ఠిన చర్యలు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. సాగర్‌.కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ న‌టించారు. ఈ చిత్రం రేపు(ఫిబ్ర‌వ‌రి 25)న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌ర్ స్టార్ చిత్రం విడుద‌ల అవుతుండ‌డంతో ప‌లు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదో ఆట‌కు అనుమ‌తి ఇస్తూ నోటీఫికేష‌న్ జారీ చేసింది. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాత్రంఎలాంటి అద‌న‌పు షోలు వేయ‌కూడ‌ద‌ని, ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కే టికెట్లు అమ్మాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఉన్నజీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని, బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఈ మేర‌కు ప‌లు థియేట‌ర్ల‌కు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో థియేటర్లకు తహశీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు తప్పవంటూ అందులో పేర్కొన్నారు. ఆయన జారీ చేసిన నోటీసులు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ రెవెన్యూ అధికారులు.. పోలీసులు, థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వీఆర్వోలను థియేటర్ల వద్దకు పంపి జీవో నంబర్ 35 అమలు అవుతుందో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.



Next Story
Share it