మరోసారి క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్

ప్రముఖ నిర్మాత శిరీష్, స్టార్ హీరో రామ్ చరణ్‌కు, ఆయన అభిమానులకు మరోసారి క్షమాపణలు తెలిపారు.

By Medi Samrat
Published on : 2 July 2025 7:07 PM IST

మరోసారి క్షమాపణలు చెప్పిన నిర్మాత శిరీష్

ప్రముఖ నిర్మాత శిరీష్, స్టార్ హీరో రామ్ చరణ్‌కు, ఆయన అభిమానులకు మరోసారి క్షమాపణలు తెలిపారు. 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, శిరీష్ ఇప్పటికే ఓ లేఖలో క్షమాపణ చెప్పారు. స్వయంగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. రామ్ చరణ్‌ను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, తమ మధ్య ఉన్న స్నేహంతో పొరపాటున మాట దొర్లిందని స్పష్టం చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం గురించి ఇటీవల శిరీష్ మాట్లాడుతూ సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో, దర్శకుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, శిరీష్ మొదట ఓ లేఖను, తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.

చిరంజీవి గారికి, రామ్ చరణ్‌కు, మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు మధ్య విడదీయరాని బంధం ఉందని శిరీష్ అన్నారు. తాను ఎంతో అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ వదులుకోవాలనుకోనన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు అనలేదని అన్నారు. మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్‌లతో కూడా మేం సినిమాలు నిర్మించాం. చిరంజీవి గారు నాతో, దిల్ రాజుతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. అంతటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదన్నారు. సంక్రాంతికి మా సినిమా విడుదల చేయొద్దని చరణ్ ఒక్క మాట చెప్పి ఉంటే ఆగిపోయేది. కానీ ఆయన మంచి మనసుతో మా గురించి ఆలోచించారు. అలాంటి వ్యక్తిని మేమెందుకు అవమానిస్తామని వివరణ ఇచ్చారు.

Next Story