కాంగ్రెస్ మాజీ సోషల్ మీడియా హెడ్, కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ 'రమ్య' తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై గురువారం బెంగళూరు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్, ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. "రమ్య స్వయంగా స్టేషన్‌కు వచ్చి వ్యక్తిపై ఫిర్యాదు నమోదు చేసింది, మేము ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసాము.. దర్యాప్తు కొనసాగుతోందని అని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొంది. ఐటి యాక్ట్‌తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్య.. 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013-2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమె మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధిస్టానం రమ్యను జాతీయ డిజిటల్ టీమ్‌కు హెడ్‌ను చేసింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ భారీ ఓటమి తర్వాత ఆమె రాజకీయాల్లో చురుకుగా లేదు. కానీ తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తూ ఉంటుంది.