ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ ఈరోజు డిసెంబర్ 23 సాయంత్రం 6.38 గంటలకు కన్నుమూశారు.
By Medi Samrat Published on 23 Dec 2024 3:49 PM GMTప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు శ్యామ్ బెనగల్ ఈరోజు డిసెంబర్ 23 సాయంత్రం 6.38 గంటలకు కన్నుమూశారు. ఆయనకు 90 ఏళ్లు. రెండు రోజుల క్రితం ఆయన తన ఇంట్లో పడిపోగా.. ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. శ్యామ్ బెనెగల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా కోమాలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
శ్యామ్ బెనెగల్ కుమార్తె పియా మాట్లాడుతూ.. తన తండ్రి ముంబయిలోని వోకార్డ్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా మరణించినట్లు తెలిపారు. సాయంత్రం 6.38 గంటలకు ఆయన మరణించారని వెల్లడించింది. ఆయన చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారని.. అది మరింత తీవ్రమైందని తెలిపారు. ఇదే ఆయన మరణానికి కారణం అని పేర్కొన్నారు. బెనెగల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వోకార్డ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
శ్యామ్ బెనగల్ అంకుర్, మండి, మంథన్ మొదలైన చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందారు. ఈ సినిమాలు 70, 80వ దశకం మధ్యలో విడుదలయ్యాయి. శ్యామ్ బెనెగల్‌ను 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయన విజయవంతమైన చిత్రాల జాబితాలో మంథన్, జుబైదా, సర్దారీ బేగం ఉన్నాయి. తన కెరీర్‌లో శ్యామ్ బెనగల్ 'భారత్ ఏక్ ఖోజ్' మరియు 'సంవిధాన్'తో సహా పలు సమస్యలపై సినిమాలు, డాక్యుమెంటరీలు, టెలివిజన్ ధారావాహికలు నిర్మించారు. శ్యామ్ బెనెగల్ డిసెంబర్ 14, 1934లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.