అతడి శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు..!
Doctors About Siddharth Shukla Death. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణంపై బాలీవుడ్ వర్గాలు నిర్ఘాంతపోయాయి. 40 సంవత్సరాల
By Medi Samrat
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణంపై బాలీవుడ్ వర్గాలు నిర్ఘాంతపోయాయి. 40 సంవత్సరాల వయసులో అతడు మరణించడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం ఉదయం ఇంట్లో గుండెపోటుకు గురి కాగా, అతడిని కుటుంబ సభ్యులు కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. సిద్ధార్థ్ కు తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు. బుధవారం రాత్రి పడుకునే ముందే ట్యాబెట్లు వేసుకున్నారని, గురవారం ఉదయాన హార్ట్ ఎటాక్ రావడంతో మరణించినట్టు కూపర్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.
పలువురు బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. సిద్ధార్థ్ 'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మోడల్ గా మొదలు పెట్టి 2008లో బుల్లితెర నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2014లో కరణ్ జొహార్ నిర్మించిన 'హంప్టీ శర్మకి దుల్హానియా' ఆయన నటించిన తొలి చిత్రం. సిద్ధార్థ్ శుక్లా బిగ్‌బాస్ సీజన్ 13 విజేతగానూ నిలిచాడు. బిగ్ బాస్ 13లో గెలవడంతో సిద్ధార్థ్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది.
సిద్ధార్థ్ శుక్లా మృతదేహానికి ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. సిద్ధార్థ్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని శవపరీక్షలో తేలింది. సిద్ధార్థ్ అంతర్గత అవయవాలను విశ్లేషించాల్సి ఉందని, ఆయన మృతికి కారణమేంటన్న విషయంపై ఆ తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు అంటున్నారు. వాటి నమూనాలను విశ్లేషణ కోసం పంపించినట్లు వివరించారు. హిస్టోపాథాలజీ జరిపిన తర్వాత వివరాలు తెలుస్తాయని అన్నారు.