ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.పి.జననాథన్(61) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకులోనై ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1959 మే 7న జన్మించిన ఆయన 2003లో 'ఇయర్కై' అనే చిత్రం ద్వారా తమిళ చిత్ర సీమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే సత్తాచాటి.. ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.
జననాథన్ ప్రస్తుతం 'లాభం' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి, శృతి హాసన్, జగపతిబాబు నటించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాల్లో నిమగ్నమైవున్న జననాథన్ హఠాత్తుగా అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మరణించారు.
జననాథన్.. ఇయర్కై, ఈ, పేరాణ్మై, పురంపోక్కు ఎన్గిర పొదువుడమై, భూలోహం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ప్రముఖ దర్శక నిర్మాత అళగన్ తమిళ్ మణివాసన్ సోదరుడు. జననాథన్ మరణవార్త విన్న సినీ ప్రముఖలు, అభిమానులు మైలాపూరు, కచ్చేరి రోడ్డులో ఉన్న ఇంటికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.