డైరెక్టర్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ అబద్ధమట..!
Director Shankar rubbishes rumours about his non bailable warrant.డైరెక్టర్ శంకర్ తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు.
By Medi Samrat
ప్రముఖ దర్శకుడు శంకర్‌కు చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తన కథను కాపీ కొట్టి ఏంథిరన్ ( రోబో ) చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొంటూ ఆరూర్ తమిళ్‌నందన్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. తన కథను 'జిగుబా' పేరుతో 1996 సంవత్సరంలో మొదటిసారి తమిళ పత్రికలో ప్రచురించానని.. మరోసారి 2007 లో 'ధిక్ ధీక్ దీపికా దీపికా' అనే నవలగా ముద్రించారన్నారు. ఈ కథతోనే దర్శకుడు శంకర్ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని.. తనకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించాడు.
దీంతో శంకర్‌ను విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం పలుమార్లు ఆదేశించింది. అయినప్పటికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో 10 సంవత్సరాలుగా తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై కోర్టు.. దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసిందని వార్తలు వచ్చాయి.
తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని డైరెక్టర్ శంకర్ తెలిపారు. తన న్యాయవాది సాయి కుమరన్ ఇదే విషయమై చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిట్ మేజిస్ట్రేట్ కోర్టును సంప్రదిస్తే, ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని చెప్పారని శంకర్ వివరించారు. కోర్టు ఆన్ లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని, ఇప్పుడా పొరబాటును దిద్దుతున్నారని శంకర్ తెలిపారు.
ఎలాంటి నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా వేదనకు గురయ్యారని వెల్లడించారు. దయచేసి తన తాజా ప్రకటనను మీడియా సంస్థలన్నీ మరింత ముందుకు తీసుకెళ్లి, తప్పుడు వార్తలు మరింత వ్యాప్తి చెందకుండా వుండాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. రోబో చిత్రం 2010 అక్టోబర్ 2న విడుదలైంది. రజనీకాంత్-ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.