నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. లాక్‌డౌన్ టైంలో అందరూ ఖాళీగా ఉంటే.. వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీసి ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన అంశం ఏదైనా సరే.. దాని మీద సినిమా తీయడం అలవాటు. ఇక ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ని కూడా వర్మ వదలలేదు. 'కరోనా వైరస్' పేరుతో ఓ సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని లాక్‌డౌన్ కాలంలోనే పూర్తి చేయడం విశేషం.
శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగస్త్య మంజూ దర్శకత్వం వహించారు. కంపెనీ క్రియేషన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ ట్రైలర్ ను విడుదల చేయగా.. తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఓ కుటుంబ సభ్యులు ఎలా భయపడిపోతున్నారో ఇందులో చూపించారు.
ఇంట్లో ఓ వ్యక్తి దగ్గుతుండడం, కరోనా వచ్చిందేమోనని ఇంట్లోని ఇతరులు భయపడుతుండడం, లాక్‌డౌన్‌లో ఇంట్లోనే కూర్చుంటూ అందరూ అసహనానికి గురవడం వంటి సీన్లను ఆయన ఇందులో చూపించారు. సినిమాలో కుటుంబ పెద్ద ఇంట్లో వారెవ్వరినీ ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకపోవడం వంటి సీన్లను ఇందులో చూడొచ్చు. త్వరలో థియేటర్లు తెరుచుకోనునండగా.. సినిమా థియేటర్స్ తెరుచుకున్న వెంటనే విడుదలయ్యే మొదటి సినిమా ఇదేనని వర్మ ఇంతకు ముందే చెప్పాడు. ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.