నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు. రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలు పవిత్రా గౌడకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు నటి పవిత్రా గౌడను అదుపులోకి తీసుకున్నారు. ఇదే హత్యకేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్‌ను సైతం దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ నగర్‌లో ఉన్న పవిత్రగౌడను అదుపులోకి తీసుకున్నారు.
రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది . హైకోర్టు ఉత్తర్వును "వికృతమైనది, పూర్తిగా అనవసరమైనది అని న్యాయస్థానం అభివర్ణించింది. హైకోర్టు డిసెంబర్ 13, 2024న బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులో తీవ్రమైన చట్టపరమైన లోపం ఉందని, అది విచక్షణతో కూడిన ఏకపక్ష నిర్ణయమని న్యాయమూర్తులు జెబి పార్దివాలా, ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ మంజూరు చేసే ముందు హైకోర్టు సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుందని, ఇది ట్రయల్ కోర్టు కోసం ఉద్దేశించిన ప్రక్రియ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.