హరిహర వీరమల్లును అడ్డుకుంటాం
'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
By Medi Samrat
'హరి హర వీరమల్లు' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర తమ ఆరాధ్య వీరుడు పండుగ సాయన్నను పోలి ఉందని, కానీ చిత్రంలో ఆయన పేరును ప్రస్తావించకుండా తమ చరిత్రను అవమానిస్తున్నారని తెలంగాణ బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ పోషిస్తున్న వీరమల్లు పాత్ర, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన జానపద వీరుడు పండుగ సాయన్న జీవితం ఆధారంగా ఉందని బీసీ, ముదిరాజ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమా ప్రచార చిత్రాల్లో గానీ, ఇతర వివరాల్లో గానీ పండుగ సాయన్న పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ పాత్రకు, పండుగ సాయన్నకు సంబంధం ఉందో లేదో తేల్చి చెప్పాలని, తమ ఆందోళనలను పట్టించుకోకుండా సినిమాను విడుదల చేస్తే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సినిమా విడుదలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ చిత్రాన్ని జూలై 24న పలు భాషల్లో విడుదల చేయనున్నారు.