తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటాం : సీఎం కేసీఆర్‌‌

CM KCR held a Meeting With Film Personalities. తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని

By Medi Samrat  Published on  23 Nov 2020 2:50 AM GMT
తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటాం : సీఎం కేసీఆర్‌‌

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో ఆదివారం ప్రగతి భవన్ లో సీఎంతో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాది దొరుకుతుంది. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు.

త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమయి, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story