చిరంజీవి ఎంతో ఆవేదనతో.. మీకిచ్చే సూచన ఇదే..!

Chiranjeevi requests people not to venture out during lockdown. భారతదేశంలో కరోనా తీవ్రత ఎంతగా ఉందో మనందరికీ తెలుసు.

By Medi Samrat  Published on  14 May 2021 2:26 PM GMT
చిరంజీవి ఎంతో ఆవేదనతో.. మీకిచ్చే సూచన ఇదే..!

భారతదేశంలో కరోనా తీవ్రత ఎంతగా ఉందో మనందరికీ తెలుసు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మనకు కనిపించకుండా పోతుంటే చాలా బాధగా ఉంటుంది. మనం అనుకున్న వాళ్లు ఇక ప్రాణాలతో లేరు అనే వార్త ఎంతో బాధను కలిగిస్తుంది. కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను కబళించి వేస్తోంది. చాలా మంది జీవితాలను తలక్రిందులు చేస్తూ ఉంది. ఇక కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే దారని చెబుతూ ఉంటారు. ఓ వైపు వ్యాక్సిన్ కొరత వెంటాడుతూ ఉన్నా.. మరో వైపు వ్యాక్సిన్లను వేసుకోడానికి ఎంతో మంది అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లను వేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు.

చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా అంటే భయపడిపోకండని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎంతో మంది మహమ్మారిని జయించారని.. మీరు కూడా జయిస్తారంటూ ధైర్యం చెప్పారు మెగాస్టార్. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి.. ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మన ఆత్మీయులలో కొందరినీ ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే.. గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

లాక్‌డౌన్‌లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌కు రిజిస్టర్ చేయించుకుని.. ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండని అన్నారు. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కొవిడ్ పాజిటివ్ అయినా.. దయచేసి భయపడకండి. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని.. డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడాలని అన్నారు. ఊపిరి సమస్య అనిపించినా, మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్స్‌ని సంప్రదించి అవసరమైతే సత్వర చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాలని అన్నారు. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయాలని వేడుకున్నారు.


Next Story
Share it