గౌతమ్ రాజు కుటుంబానికి అండగా నిలిచిన చిరంజీవి

Chiranjeevi, Ram Charan and Tolly celebs pay tribute. ప్రముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు హైద‌రాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే

By Medi Samrat  Published on  6 July 2022 12:09 PM GMT
గౌతమ్ రాజు కుటుంబానికి అండగా నిలిచిన చిరంజీవి

ప్రముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు హైద‌రాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతిపట్ల టాలీవుడ్ న‌టులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కనిర్మాతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించారు. గౌత‌మ్ రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి రూ.2 ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గౌత‌మ్ రాజు కుటుంబానికి చిరంజీవి త‌ర‌పున త‌మ్మారెడ్డి భ‌రద్వాజ రూ.2 ల‌క్ష‌లు అంద‌జేశారు.

గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో ఎడిటింగ్ అంత వాడిగా ఉంటుందని గుర్తుచేసుకున్నారు. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితమని, ఎంత నెమ్మదస్తుడో ఆయన ఎడిటింగ్ అంత వేగమని తెలిపారు. తన చట్టానికి కళ్లు లేవు సినిమా నుంచి ఖైదీ నంబర్ 150 వరకు ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్ రాజు లేకపోవడం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్‌ చేశారు.

గౌతమ్‌రాజు మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరమని.. అద్భుతమైన ప్రతిభగల ఎడిటర్‌, తనకు ఎంతో ఆత్మీయులని, మృధుస్వభావి అని తెలిపారు. అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీపరిశ్రమలో గౌతమ్‌రాజు చెరగని ముద్రవేశారని చెప్పారు. ఆయన మన మధ్యలేకపోవడం ఎంతో దురదృష్టకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.












Next Story