ముగిసిన చంద్రమోహన్ అంత్య‌క్రియ‌లు

సీనియర్ నటులు చంద్రమోహన్ భౌతిక‌కాయానికి అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

By Medi Samrat  Published on  13 Nov 2023 4:58 PM IST
ముగిసిన చంద్రమోహన్ అంత్య‌క్రియ‌లు

సీనియర్ నటులు చంద్రమోహన్ భౌతిక‌కాయానికి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. హైదరాబాద్ లోని పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు చంద్ర మోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. చంద్రమోహన్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్​నగర్​లోని నివాసంలో ఉంచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

చంద్రమోహన్‌ కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. నిర్విరామంగా పనిచేస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2006లో రాఖీ సినిమా పూర్తయ్యాక చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్‌ సినిమా సమయంలోనూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోపీచంద్‌ 'ఆక్సిజన్‌' మూవీలో నటించిన తర్వాత సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు.

Next Story