సినీ నటి కరాటే కళ్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. అత్యాచార బాధితుల వివరాలను బహిర్గతం చేయడం చట్ట రీత్యా నేరం. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల కిందట హైదరాబాద్ నగర పరిధిలోని సింగరేణి కాలనీలో ఓ బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే నటి కరాటే కళ్యాణి సైతం స్పందించారు. బాధితురాలి కుటుంబానికి అండగా పోస్టులు పెట్టారు. అయితే కరాటే కళ్యాణి బాధితురాలి వివరాలను సోషల్‌మీడియాలో షేర్ చేశారని ప్రైవేట్ కంప్లయింట్ చేశాడు. జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండ ఏరియాకు చెందిన నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి కోర్టులో కంప్లెయింట్ చేశాడు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది.