హైదరాబాద్ : బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. అత్యధిక ఓట్లు సాధించి ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న సన్నీని షో వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున విజేతగా ప్రకటించారు. ఈ సీజన్‌లో ఫైనలిస్ట్‌లుగా శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్, షణ్ముఖ్ నిలవగా.. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు గట్టిపోటీ ఇచ్చారు. సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. అతను పలు టీవీ ఛానళ్లలో వీజేగా పనిచేస్తున్నాడు.
ఇదిలావుంటే.. లీక్ వీరులు ముందుగానే మానస్, సిరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని సోషల్ మీడియాలో చెప్పేశారు. ఇప్పటి వరకు వీరు చెప్పింది దాదాపుగా నిజం కావడంతో.. ఇది కూడా నిజమేనని నమ్మారు ప్రేక్షకులు. ఇక వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్‌లలో ప్రధానంగా సన్ని, జశ్వంత్ మధ్యే పోటి ఉందని అనేది లీక్ వీరులు మాట. అనధికార ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. వీజే సన్ని 34శాతంతో టాప్ ప్లేసులో ఉన్నాడని.. 31 శాతం ఓట్లతో షణ్ముఖ్ జశ్వంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని చెప్పేశారు. మరోమారు లీకువీరుల మాటను నిజం చేస్తూ సన్నినే విజేతగా నిలిచాడు.