బీజేపీలో చేరిన నటుడు పవన్
భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.
By - Medi Samrat |
భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. మంగళవారం నాడు పవన్ సింగ్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP) చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకుడు వినోద్ తవ్డేలను దేశ రాజధానిలో కలిశారు. ఇది కొత్త రాజకీయ చర్చలకు దారితీసింది. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన వినోద్ తవ్డే, పవన్ సింగ్ బీజేపీలో భాగమేనని, తమ పార్టీతోనే కొనసాగుతాడని ధృవీకరించారు. " పవన్ సింగ్ ఉపేంద్ర కుష్వాహా నుండి ఆశీస్సులు పొందారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కోసం చురుకుగా పని చేస్తారు" అని తవ్డే స్పష్టం చేశారు.
భోజ్‌పురి నటుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం బీహార్ ఎన్నికలకు ముందు ఒక కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. భోజ్‌పురి మాట్లాడే ఓటర్లలో పవన్ సింగ్ కు మంచి ప్రజాదరణ ఉంది. పార్టీ ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో, పవన్ సింగ్ కరకట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయం ఉపేంద్ర కుష్వాహా ఓటమికి ప్రధాన కారణంగా భావించారు. రాజ్‌పుత్ వర్గం కుష్వాహాకు మద్దతు ఇవ్వలేదని, ఇది పలు నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతుంటారు. భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి నిలిపారు. అయితే అతను తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.