భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!

Bheemla Nayak Pre-Release Event Cancelled. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు.

By Medi Samrat  Published on  21 Feb 2022 12:26 PM IST
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గౌతంరెడ్డిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 49 సంవత్సరాలే. డాక్టర్లు పరీక్షించే సరికి పల్స్‌ దొరకలేదు. అత్యవసర చికిత్స నిర్వహించినా కూడా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేస్తున్నారు. మేకపాటి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మరణించారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన మరణం పట్ల తెలుగు రాష్ట్రాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన మరణం కారణంగా ఈరోజు భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉండగా.. మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం కారణంగా ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నామని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలిపింది. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు. 25వ తేదీ ఈ సినిమా విడుదలకానుంది.


Next Story