'బరాబర్ ప్రేమిస్తా' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్ పాడిన పాట వివాదాస్పదం కావడంపై చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. పాటలో అసభ్యకర పదాలు దొర్లడంపై నిర్మాత చిన్ని విచారం వ్యక్తం చేశారు. చిత్రంలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశంతో చంద్రహాస్ పాట పాడారని, దాంట్లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. దాని గురించి ఈ ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. అతడు కావాలని చేయలేదని, అందుకు తాము బాధపడుతున్నామన్నారు. పాట పాడి కిందకు వచ్చిన తర్వాత అలా చేయకూడదని కూడా చెప్పినట్లు వెల్లడించారు. చంద్రహాస్ పాటను అసభ్యకర పదాలతో పాడినందుకు చాలా బాధగా ఉందని దర్శకుడు సంపత్ రుద్ర అన్నారు. చిత్రంలో మాత్రం అలాంటి పాటలు లేవని స్పష్టం చేశారు.
ఈ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన 'గుంజి గుంజి' పాటలో అసభ్య పదాలు ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటలో ఉపయోగించిన అసభ్యకర పదజాలంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది.