ఏపీ మంత్రి రోజాకు, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు మధ్య గతంలో టీవీ డిబేట్ సాక్షిగా విభేదాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్షమాపణల పర్వం కూడా కొనసాగింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా గురించి బండ్ల గణేష్ చాలా అభిమానంగా మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆమెకు సినీ పరిశ్రమ తరపున సన్మానం చేయాలని అన్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు ఓడిపోయి, రెండు సార్లు గెలిచిన రోజాకు మంత్రి పదవి రావడం సంతోషకర విషయమని, రోజాను మంత్రిగా చూడటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు.
ఆమెకు మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. విజయసాయిరెడ్డికి ఒక వ్యక్తిపై కోపం ఉంటే ఆయననే విమర్శించాలని... అంతేకానీ కులం పేరుతో అందరినీ దూషించడం మంచిది కాదని బండ్ల గణేష్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కులం పేరుతో దూషించడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాదులో కరెంట్ లేదని ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ కొందరి గురించి తనను అడగొద్దని అన్నారు. బొత్స తనకు అన్నయ్యలాంటి వారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని.. ఇండియాలోనే తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ అని చెప్పారు.