బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నాంపల్లి కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆదివారం అతడిని పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని బెయిల్ ఉత్తర్వులలో ఆదేశించింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లర్లు, ఆస్తుల ధ్వంసానికి కారణమయ్యారనే అభియోగాలతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ప్రశాంత్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే.. ప్రశాంత్ బెయిల్ కోసం పిటీషన్ వేయనగా.. ఈ రోజు కోర్టు అతడికి బెయిల్ ఇచ్చింది.
బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో ఆరు బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై గజ్వేల్ మండలం కొల్గూరులో ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.