కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణాన్ని.. ఆయన అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. పునీత్ మరణించినప్పటి నుండి ఆయన ఇక లేరన్న వార్తను దింగమింగుకోలేక ఓ వ్యక్తి వారం రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. చామరాజనగర్ జిల్లా కొళ్లేగాల భీమానగర్‌కు చెందిన శివమూర్తి (31) పునీత్ రాజ్‌కుమార్ పెద్ద అభిమాని. శివమూర్తి ఫొటో గ్రాఫర్‌గా పని చేసేవాడు. పలుసార్లు పునీత్‌ను శివమూర్తి కలిసారు. పునీత్ స్టైల్‌లో డ్యాన్స్‌లు చేస్తూ ఇరగదిసేవారు. పునీత్ మృతి చెందినప్పటి నుండి శివమూర్తి ఆహారం తీసుకోవడం మానేశాడు. దీంతో తీరుమార్చుకోవాలని కుటుంబ సభ్యులు, మిత్రులు శివమూర్తికి సూచించారు. ఎంతకు వినని అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా శివమూర్తి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
46 ఏళ్ల వయసులోనే పునీత్ తనువు చాలించడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన చేసిన దానాలు, మంచి పనుల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఆయన తన కళ్లను కూడా దానం చేశారు. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురిలో బతికే ఉన్నారు. ఆయన కళ్ళు ఇంకా ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాయి. పునీత్ తన కళ్ళు దానం చేశారు. ఆయన మరణం తర్వాత కళ్ళను శరీరం నుండి సేకరించి బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ లో భద్రపరిచారు. ఆ కళ్లను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పై పొర, లోపలి పొర అని రెండు భాగాలుగా విభజించి ఆ పొరలు అవసరం ఉన్న నలుగురిలో అమర్చామని తెలిపారు. చనిపోయాక కూడా పునీత్ తన కళ్ళ ద్వారా నలుగురి జీవితాలలో వెలుగు నింపారు.